ఔషధ ధరలకు కళ్లెం

దేశంలో ఔషధ ధరలకు కళ్లెం వేయాలంటూ ఎంతోకాలంగా వివిధ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుండగా, ఇన్నాళ్లకు ఇది ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పటికే కేన్సర్ ఔషధాల ధరలు తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు కేంద్రం చర్యలతో మరిన్ని ఔషధాల ధరలు తగ్గనున్నాయి. గత ఆరు నెలల కృషి ఫలితంగా గత వారం ఢిల్లీలో నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తయారీదారులు, పంపిణీదారులు ఒక అంగీకారానికి వచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మందుల ధరలు తగ్గిపోనున్నాయి. 


వ్యాధులంటే కాదు, మందులంటేనే భయం...


దేశంలోని మెజారిటీ ప్రజలు వ్యాధులకు భయపడడం లేదు. వాటికి వాడవలసిన మందుల ధరలు చూసి జడుసుకుంటున్నారంటే ఇందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అందుకే మందుల ధరలకు కళ్లెం వేయాలని పలు వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకోగా ఎట్టకేలకు వారి బాధను అర్థం చేసుకున్న మోడీ సర్కారు ఔషధాల ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటిలో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ధరలు తగ్గబోయే ఔషధాల్లో.. రెటెప్లేస్, ఇమ్యూనోగ్లోబులిన్, టెనెక్టెప్లేస్, ఎరిథ్రోపొయిటిన్ ఇంజక్షన్, టెర్లిప్రెస్సిన్ ఇంజక్షన్, పిపెరాసిల్లిన్ అండ్ టాజాబ్యాక్టమ్, రిటూక్సిమాబ్, వొరికోనజోల్ ఇంజక్షన్ వంటివి ఉన్నాయి.